పాలిటెక్నిక్‌లో ఏ కోర్సు బెటర్.. పాలిటెక్నిక్‌లో ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఏ కోర్సులో చేరితే భవిష్యత్ బాగుంటుంది. ఏ సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి? అనే వివరాలు మీకోసం అందిస్తున్నాం..
పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు ఇటు పదో తరగతి పరీక్షలు రాసారు. మే 9న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ జూన్ 4 వరకు కొనసాగనుంది. జూన్ 30 పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. అందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, హర్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు సైతం పాలిసెట్ ర్యాంకుల ఆధారంగానే సీట్లను కేటాయించనున్నారు. అయితే పాలిటెక్నిక్‌లో ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఏ కోర్సులో చేరితే భవిష్యత్ బాగుంటుంది. ఏ సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి? అనే వివరాలు మీకోసం అందిస్తున్నాం..
తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల్లో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ‘పాలిసెట్’ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీలతోపాటు ప్రైవేటు, ఎయిడెడ్ సంస్థలన్ని కలిపి తెలంగాణాలో దాదాపు 300 కాలేజీల వరకు ఉన్నాయి. ఇందులో సుమారు 50వేల సీట్లవరకు అందుబాటులో ఉన్నాయి. టెన్త్‌క్లాస్ పూర్తి చేసుకున్న, ప్రస్తుతం టెన్త్ రాస్తున్న విద్యార్థులెవరైనా.. పాలిసెట్ పరీక్షను రాయవచ్చు.
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ఇవే..
మెకానికల్ ఇంజినీరింగ్:
మెషిన్స్ తయారీ, పనిచేసే విధానం, థర్మోడైనమిక్స్, ఫిజిక్స్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్ వంటి అంశాలు ఇందులో ఉంటాయి.
సివిల్ ఇంజినీరింగ్:
రోడ్లు, భవనాలు, బ్రిడ్జెస్, రిజర్వాయర్స్, డిప్డ్యామ్స్, కాలువలు వంటి వాటి ప్లానింగ్, నిర్మాణం, మెటీరియల్ సైన్స్, వాటి ధర్మాలు తదితర అంశాలు ఇందులో బోధిస్తారు.
కెమికల్ ఇంజినీరింగ్:
కెమికల్స్ తయారీ, రియాక్షన్స్, కెమికల్ ప్రాసెస్, వివిధ రసాయనాల మిక్సింగ్, కెమికల్స్ యూసేజ్ వంటి అంశాలను ఇందులో తెలుసుకుంటారు.
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్:
కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్ వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా కంప్యూటర్ ఆపరేషన్, ప్రోగ్రామింగ్, పనిచేసే విధానం తదితర అంశాలను నేర్పిస్తారు.
ఐటీ ఇంజినీరింగ్:
కంప్యూటర్స్, టెలికమ్యూనికేషన్ వస్తువులను ఉపయోగించి సమాచార సేకరణ, స్టోరేజ్, సర్క్యూలేట్, మెయింటెనెన్స్, రిట్రీవ్, డిస్ర్టిబ్యూషన్, సెక్యూరిటీ వంటి విధులను ఐటీ ఇంజినీర్ నిర్వర్తిస్తాడు.
ఐసీ ఇంజినీరింగ్:
కంట్రోల్ సిస్టమ్స్ డిజైన్, ప్రొడక్షన్, ఆటోమేషన్ ఆఫ్ సిస్టమ్స్ వంటి అంశాలను స్టడీ చేసే శాస్ర్తం ఐసీ ఇంజినీరింగ్. మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్‌కు ఇది సమానం.
ఈసీ ఇంజినీరింగ్:
ఎలక్ర్టానిక్ సిస్టమ్స్, ఎక్విప్మెంట్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ర్టోమ్యాగ్నటిక్ వేవ్స్ తదితర అంశాలను ఈ కోర్సులో నేర్చుకుంటారు.
ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ ఇంజినీరింగ్:
ఎలక్ర్టిక్ బోర్డ్ తయారీ, పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ర్టిబ్యూషన్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చే కోర్సు ఇది. అలాగే వివిధ ఎలక్ర్టానిక్స్ వస్తువుల తయారీ, పనిచేసే విధానం ఇందులో నేర్పిస్తారు.
ఎలక్ర్టానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజినీరింగ్:
ఎలక్ర్టానిక్స్ వస్తువుల ద్వారా కమ్యూనికేషన్ సిస్టమ్స్ పనిచేసే విధానంను నేర్పించే బ్రాంచ్ ఇది.
పెట్రోలియం ఇంజినీరింగ్:
పెట్రోలియం, డీజిల్ వంటి ఇంధనాల వెలికతీత, శుద్ధి విధానాలు అధ్యయనం శాస్ర్తం ఇది.
ఆర్కిటెక్చురల్ ఇంజినీరింగ్:
ఇది వాస్తు శాస్ర్తం. బిల్డిండ్ కన్‌స్ర్టక్షన్‌లో ప్లానింగ్, స్ర్టక్చర్, ప్లేస్మెంట్, డైమెన్షన్స్, వెంటిలేషన్స్, ల్యాండ్‌స్కేప్, స్టెయిర్కేస్, ఫర్నీచర్, ఫ్లోర్స్, తదితర అంశాల డిజైనింగ్ అండ్ ప్లానింగ్ గురించి ఇందులో అధ్యయనం చేస్తారు.
ఏరోనాటికల్ ఇంజినీరింగ్:
స్పేస్ షటిల్స్, రాకెట్స్ అండ్ స్పేస్ స్టేషన్స్ వంటి స్పేస్ క్రాఫ్ట్స్ పనితీరును ఏరోస్పేస్ ఇంజినీరింగ్తెలుపుతుంది. ఏరోనాటికల్, ఆస్ర్టోనాటికల్ ఇంజినీర్లు ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ స్పేస్‌క్రాఫ్ట్ డిజైనింగ్, కన్స్ర్టక్టింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్, మెయింటెనెన్స్ మరియు రీసెర్చ్ అండ్ టెక్నికల్ అంశాలను డీల్ చేస్తారు.
ఏరోస్పేస్ ఇంజినీరింగ్:
ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ అండ్ మిస్సైల్స్ వంటి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన విషయాలు ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో చదువుతారు. ఏరోస్పేస్ ఇంజినీర్లు రాకెట్/శాటిలైట్స్ నమూనా తయారీ–వాటి పనితీరు, విడిభాగాలు, యంత్రపరికరాల తయారీ, టెస్టింగ్ వంటి విధులను నిర్వర్తిస్తారు.
ఆటోమొబైల్ ఇంజినీరింగ్:
ఒక మెషిన్ లేదా ఇంజిన్ ఏ విధంగా పనిచేయాలో తెలిపే ఇంజినీరింగ్ మెకానిక్స్, డ్రాయింగ్, సాలిడ్స్ మెకానిక్స్, ఆటోమోటివ్ ఇంజిన్స్, వెహికల్ డైనమిక్స్, ఎయిర్ కండిషనింగ్, కంట్రోల్ సిస్టమ్స్ తదితర అంశాలను నేర్చుకుంటారు.
మైనింగ్ ఇంజినీరింగ్:
షిప్స్, బోట్స్ వంటి సముద్ర వాహనాల్లో ఉపయోగించే మెషిన్స్ డిజైనింగ్, తయారీ, పనిచేసే విధానం, మెయింటెనెన్స్ అండ్ రిపేర్ వంటి అంశాలను మెరైన్ ఇంజినీర్ డీల్ చేస్తారు.
బయోటెక్నాలజీ ఇంజినీరింగ్:
మానవుల్లో బయో ఆర్గాన్స్, మైక్రో ఆర్గాన్స్ పై రీసెర్చ్ చేసి వాటిని డెవలప్ చేయడానికి ఉపయోగపడే అంశాలను ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. అగ్రికల్చర్, ఫెర్టిలైజర్స్, వ్యాధులు, వ్యాక్సిన్స్, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ఎనిమల్ హజ్బెండరీ వంటి ఇతర శాస్ర్తాల అంశాలను కూడా ఇందులో చదువుతారు.
ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్:
ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ డిజైన్, ప్రాసెసింగ్, తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి అంశాలను స్టడీ చేసే అంశాలను డీల్ చేసేది ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్.
అగ్రికల్చర్ ఇంజినీరింగ్:
అగ్రికల్చర్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ఇతర బ్రాంచ్‌ల నాలెడ్జ్ను అగ్రికల్చర్ ప్రిన్సిపుల్స్‌కు అప్లై చేసే విధారం తదితర టెక్నాలజీ టాపిక్‌లు ఇందులో ప్రధానాంశాలు.
ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ:
ఇది ఫుడ్ సైన్స్‌లో ఒక బ్రాంచ్. ముడి ఆహార పదార్థాల ప్రాసెసింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ తదితర టెక్నిక్స్, మెథడ్స్‌ను అధ్యయనం చేస్తారు.
డైరీ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్: మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ తదితర టెక్నిక్స్, పద్ధతులను తెలుసుకుంటారు.
పవర్ ఇంజినీరింగ్:
ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్ సబ్‌బ్రాంచ్ అయిన పవర్ ఇంజినీరింగ్ విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, వినియోగం వంటి అంశాలను తెలుసుకుంటారు.
ప్రొడక్షన్ ఇంజినీరింగ్:
ఇంజినీరింగ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ టెక్నాలజీల కాంబినేషన్. ఇందులో ఏదైనా వస్తువుకు సంబంధించిన ప్రొడక్షన్ టెక్నిక్స్ నేర్చుకుంటారు.
టెక్స్ టైల్ ఇంజినీరింగ్:
దుస్తులు, వాటి ముడి పదార్థాల తయారీ, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎక్విప్మెంట్, మార్కెటింగ్ వంటి టాపిక్‌లను అధ్యయనం చేసే ఇంజినీరింగ్ బ్రాంచ్ ఇది.
ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్:
సాయిల్ సైన్స్, బయాలజీ, కెమిస్ర్టీ, పబ్లిక్ హెల్త్, వాటర్, ఎయిర్, జియాలజీ, హైడ్రాలజీ, హైడ్రాలిక్స్ వంటి తదితర అంశాలను అధ్యయనం చేస్తారు.
డిప్లొమా తర్వాత బీటెక్
డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగం చేయకుండా పై చదువులు చదువుకోవచ్చు. ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈసెట్ రాసి లెటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌లో చేరవచ్చు. విద్యార్థి డిప్లొమాలో ఎంచుకున్న బ్రాంచ్ ఆధారంగా డైరెక్ట్ సెకండియర్లోకి అడ్మిషన్ కల్పిస్తారు. లేదంటే సాధారణ డిగ్రీలో కూడా చేరవచ్చు. డిప్లొమాను ఇంటర్ తత్సమాన కోర్సుగా కూడా భావిస్తారు.
డిప్లొమా తర్వాత జాబ్ గ్యారెంటీ..
డిప్లొమా పూర్తి చేసుకున్న తర్వాత వివిధ కంపెనీలు, ఇండస్ర్టీల్లో అప్రెంటీస్ చేసి ఉద్యోగావకాశం పొందవచ్చు.అప్రెంటిస్ సమయంలో స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. బీహెచ్ఈఎల్బీఈఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, సెయిల్, గెయిల్, ఎన్ఎండీసీ, ఎన్ఎఫ్సీ, కొచ్చిన్ షిప్‌యార్డ్, పవన్‌హాన్స్ లిమిటెడ్, బీఈసీఐఎల్, డీఆర్డీవో వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఆర్టీసీ వంటి రాష్ర్ట ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రైవేటు సెక్టార్లో అటోమొబైల్, ఎలక్ర్టానిక్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్, ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్, కన్స్ర్టక్షన్, ఫెర్టిలైజర్స్ వంటి కంపెనీలుకూడా డిప్లొమా చేసిన వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నాయి. యూపీఎస్సీ నిర్వహించే ఇంజినీరింగ్ ఎగ్జామినేషన్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఎస్సెస్సీ, రైల్వే, ఇండియన్ ఆర్మీ, స్టీల్ ప్లాంట్, బ్యాంక్స్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్లోనూ చేరవచ్చు. ఉద్యోగం అప్పుడే వద్దనుకుంటే ఉన్నత చదువులు చదివి ఫ్యాకల్టీగానూ గుర్తింపు సాధించవచ్చు.
ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థలివే..
ఎయిర్‌లైన్స్: స్పైస్ జెట్, ఇండిగో, జెట్‌ఎయిర్‌వేస్, కన్స్ర్టక్షన్ ఫర్మ్స్: యూనిటెక్, డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్, జీఎంఆర్, మైటాస్, ఎల్అండ్టీ, కమ్యూనికేషన్: భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఐడియా, బీఎస్ఎన్ఎల్, కంప్యూటర్ ఫర్మ్స్: టీసీఎస్, హెచ్‌సీఎల్, విప్రో, పోలారిస్, ఆటోమొబైల్స్:మారుతీ సుజుకీ, టొయోటా, టాటా, మహీంద్రా, బజాజ్ ఆటో, షిప్‌యార్డ్స్, ఎలక్ర్టికల్/పవర్: టాటా పవర్, సీమెన్స్, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, ఎలక్ర్టానిక్స్: బీహెచ్ఈఎల్,బీఈఎల్, డీఆర్డీవో, హెచ్ఏఎల్, మెకానికల్ ఇంజినీరింగ్: హిందుస్తాన్ యూనీలీవర్, ఏసీసీ, వోల్టాస్, ఎనర్జీ ఫర్మ్స్: ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, భారత్ పెట్రోలియం, గెయిల్, స్టీల్ ఇండస్ర్టీస్: సెయిల్, వైజాగ్ స్టీల్ సంస్థలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.